నేటి చర్చ : హైదరాబాద్, హైదరాబాద్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు ఛేదించిన పోలీసులు...పనిమనిషి నమ్మకద్రోహం..5 నెలల వేట తర్వాత నేపాల్ గ్యాంగ్ అరెస్ట్.

నేటి చర్చ : హైదరాబాద్, హైదరాబాద్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు ఛేదించిన పోలీసులు...పనిమనిషి నమ్మకద్రోహం..5 నెలల వేట తర్వాత నేపాల్ గ్యాంగ్ అరెస్ట్!
ఇంట్లో పనిమనిషిగా చేరి, యజమానుల నమ్మకాన్ని గెలుచుకుని, చివరికి ప్రాణాలనే బలిగొన్న దారుణ ఘటనలో హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు కీలక నిందితులను అరెస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో మే నెలలో జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాయ్ వినయ్ రంజన్ భార్య తనూజ రంజన్ హత్య కేసులో పనిమనిషి సహా నలుగురిని నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇన్‌సైడర్ ప్లాన్: నేపాల్‌కు చెందిన ధర్మ తిరువా (కల్పన) జూన్ 2025లో నెలకు రూ. 20,000 జీతానికి వినయ్ రంజన్ ఇంట్లో పనిమనిషిగా చేరింది.
పూణేలో ఉన్న నేపాల్ ముఠా సభ్యుడు బికాస్‌తో టచ్‌లో ఉంటూ.. ఇంట్లోని బంగారం, యజమానుల కదలికల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది.
పక్కా రెక్కీ: మే 4న ఐపీఎస్ అధికారి బెంగళూరు వెళ్లగానే కల్పన గ్యాంగ్‌కు సిగ్నల్ ఇచ్చింది. పూణే, ముంబైల నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఠా.. మే 7న ఎంజీబీఎస్ (MGBS) సమీపంలోని రవీంద్ర బార్‌లో మీట్ అయి రెండు గ్రూపులుగా విడిపోయింది.
దారుణ హత్య: మే 7 అర్ధరాత్రి కల్పన తలుపు తీయడంతో ముగ్గురు దొంగలు లోపలికి ప్రవేశించారు. ఆ అలజడికి తనూజ రంజన్ నిద్రలేవడంతో, ఆమె చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం 225 గ్రాముల బంగారం, విలువైన వస్తువులు దోచుకుని కాజీపేట అటవీ ప్రాంతంలో 9 వాటాలుగా పంచుకుని నేపాల్ పారిపోయారు.
5 నెలలు.. 8 రాష్ట్రాలు.. పోలీసుల వేట!
ఈ కేసు కోసం డీసీపీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ డేనియల్ శాంతి కుమార్ నేతృత్వంలో 19 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది.
బెంగళూరు, ముంబై, పూణే, సూరత్, పాట్నా, ఢిల్లీ, లక్నో, ఉత్తరాఖండ్ మరియు భారత్-నేపాల్ సరిహద్దుల్లో 5 నెలల పాటు గాలించారు.
మే 22న ఇద్దరిని అరెస్ట్ చేయగా, తాజాగా అక్టోబర్ 26న నాంపల్లి వద్ద ప్రధాన నిందితులు ధర్మ తిరువా (కల్పన), గణేష్ బి.కె, చంద్ర బహదూర్ తమాంగ్, గణేష్ బహదూర్ షాహీలను అరెస్ట్ చేసి రూ. 51,130 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా వివిధ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న మరో 6 గురు నేపాల్ నేరస్తులను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, బెంగళూరులలో కూడా ఇదే తరహాలో పనిమనుషుల సాయంతో దోపిడీలకు వీరు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.
