స్థల వివాదం చిచ్చు - బెల్ట్ షాపులో బీరు సీసాతో దాడి.

స్థల వివాదం చిచ్చు - బెల్ట్ షాపులో బీరు సీసాతో దాడి.
=> బెల్ట్ షాపులో స్థల వివాదం.
=> బీరు సీసాతో వ్యక్తిపై దాడి -
తీవ్ర గాయాలు.
=> హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స.
నేటి చర్చ క్రైమ్ న్యూస్ :- అశ్వారావుపేట,
అశ్వారావుపేట పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తిపై బెల్ట్ షాపులో బీరు సీసాతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థల వివాదం నేపథ్యంలో ఇద్దరి మధ్య తలెత్తిన వాగ్వాదం చివరకు దాడికి దారితీసింది.
ఈ ఘటనలో దాచేపల్లి వీరభద్రం తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట ఏఎస్ఆర్ కాలనీకి చెందిన దాచేపల్లి వీరభద్రం (తండ్రి వీర రాఘవులు) సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో పేపర్ బొడ్డు సమీపంలోని ఓ బెల్ట్ షాపులో మద్యం సేవిస్తున్నాడు.
అదే సమయంలో అతని పక్కనే మద్యం సేవిస్తున్న పసుపులేటి రామస్వామితో స్థలానికి సంబంధించిన విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకోవడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది.
దీంతో ఆగ్రహానికి గురైన పసుపులేటి రామస్వామి పక్కనే ఉన్న బీరు సీసాతో దాచేపల్లి వీరభద్రం ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో వీరభద్రం ముఖానికి బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది.
గాయపడిన వీరభద్రంను కుటుంబ సభ్యులు తొలుత అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై వీరభద్రం చిన్న కుమారుడు దాచేపల్లి ధర్మతేజ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, హెడ్ కానిస్టేబుల్ ఎం. కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థల వివాదం కారణంగా జరిగిన ఈ దాడి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
