15 ఏళ్ల తర్వాత న్యాయస్థానం సంచలన తీర్పు, మాజీ సీఐకి ఏడాది జైలు శిక్ష.

15 ఏళ్ల తర్వాత న్యాయస్థానం సంచలన తీర్పు,, మాజీ సీఐకి ఏడాది జైలు శిక్ష.
ననేటి చర్చ : నిజామాబాద్, లంచం కేసులో నిజామాబాద్ మాజీ పోలీస్ అధికారికి శిక్ష.. రూ.10 వేల జరిమానా విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.
అవినీతి కేసులో సుదీర్ఘకాలం కొనసాగిన న్యాయప్రక్రియకు తెరపడింది. సుమారు 15 ఏళ్ల క్రితం నమోదైన లంచం కేసులో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధారావత్ బాలాజీని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం (నవంబర్ 11) తీర్పు వెలువరించింది.
2011లో నమోదైన అవినీతి కేసు..
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ సర్కిల్ పరిధిలో గతంలో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ధారావత్ బాలాజీపై 2011లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఒక కేసుకు సంబంధించి బాధితుల నుంచి లంచం డిమాండ్ చేసిన వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. అనంతరం సంబంధిత ఆధారాలతో న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేశారు.
రెండు అభియోగాలపై ఏడాది చొప్పున శిక్ష..
ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల రెండో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎం.డి. అబ్దుల్ జావీద్ పాషా నిందితుడిని దోషిగా నిర్ధారించారు.
అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డి) రెడ్‌విత్ 13(2) కింద నమోదైన రెండు అభియోగాలపై ఒక్కో ఏడాది చొప్పున కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు రూ.10 వేల జరిమానా చెల్లించాలని తీర్పులో పేర్కొంది.
15 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు.
2011లో నమోదైన కేసులో దాదాపు 15 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులు అవినీతికి పాల్పడితే చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించేలా ఇలాంటి తీర్పులు నిలుస్తాయి.
