భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. ఎయిర్ హోస్టెస్ ను రూ.13 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య.

భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. ఎయిర్ హోస్టెస్ ను రూ.13 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య.
కారు జీపీఎస్ (GPS) ట్రాకింగ్ సాయంతో పక్కా ప్లాన్
నేటి చర్చ : మహారాష్ట్ర,21 నవంబర్, భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఓ భార్యను కసాయిగా మార్చింది. తన భర్త స్నేహితురాలిని అడ్డు తొలగించుకోవడానికి ఏకంగా రూ. 13 లక్షల సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో హత్య చేయించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తొలుత ఇది దోపిడీ దొంగల పని అని భావించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి అయిన భార్యతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
అసలేం జరిగింది?
పుణె విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఉద్యోగినిగా (ఎయిర్ హోస్టెస్) పనిచేస్తున్న వర్ష తుర్కార్ (35), నవంబర్ 14న తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయమున్న నితీష్ అగర్వాల్‌తో కలిసి గోండియాకు 30 కిలోమీటర్ల దూరంలోని తిరోడాకు విహారయాత్రకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా బోంద్రాణి అటవీ ప్రాంతంలోని ఒక శివాలయం వద్ద కారును ఆపారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు వర్షపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. కడుపు, వీపు భాగాల్లో తీవ్ర గాయాలైన ఆమెను సమీపంలోని మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న ప్రభుత్వ గ్రామీణ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
దోపిడీ కాదు.. పక్కా సుపారీ హత్య:
తొలుత గుర్తు తెలియని దోపిడీ దొంగలు తమపై దాడి చేశారని నితీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఇతర ఆభరణాలు అలాగే ఉండటంతో ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించుకున్నారు.
భార్య కుట్ర బట్టబయలు:
నితీష్ అగర్వాల్ భార్య మోనా అగర్వాల్ (41)కు తన భర్త, వర్ష మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కలిగింది. దీంతో వర్షను అంతమొందించాలని నిర్ణయించుకున్న మోనా, తన పొరుగింటి వ్యక్తి అయిన కునాల్ శ్యామ్‌లాల్ కుంభల్కర్ (31)ను ఆశ్రయించింది. అతను షారుఖ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ పఠాన్ (33) అనే వ్యక్తిని సంప్రదించగా, హత్య చేసేందుకు రూ. 13 లక్షలకు ఒప్పందం కుదిరింది. షారుఖ్ ఈ హత్యను అమలు చేయడానికి ముగ్గురు వ్యక్తులను నియమించుకున్నాడు.
పట్టించిన కారు జీపీఎస్ (GPS) ట్రాకింగ్:
నితీష్ నడుపుతున్న కారు అతని భార్య మోనా పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ కారుకు ఉన్న 'టయోటా ఐ-కనెక్ట్ జీపీఎస్' (Toyota i-Connect GPS) యాప్ లాగిన్ వివరాలను మోనా హంతకుల ఫోన్లలో యాక్టివేట్ చేసింది. దీనివల్ల నితీష్, వర్ష ప్రయాణిస్తున్న కారు లైవ్ లొకేషన్‌ను నిందితులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయగలిగారు. నిర్మానుష్యమైన బోంద్రాణి అటవీ ప్రాంతంలో కారు ఆగగానే, అక్కడికి చేరుకున్న ముగ్గురు దుండగులు వర్షను కత్తులతో పొడిచి హత్య చేశారు.
200 సీసీటీవీ కెమెరాల పరిశీలన.. నలుగురి అరెస్ట్:
గోండియా పోలీసులు నేరం జరిగిన ప్రాంతం నుండి తిరోడా, ఖైర్లాంజీ, వారసియోని, బాలాఘాట్, గోండియా మార్గాల్లో ఉన్న దాదాపు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. నితీష్ కారును బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెంబడిస్తున్నట్లు అందులో గుర్తించారు. ఈ ఆధారాలతో నవంబర్ 19న గోండియాలో ఇమ్రాన్ కరీం షేక్ (26) అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కుట్ర మొత్తం బయటపడింది.
స్థానిక క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఇప్పటివరకు మోనా అగర్వాల్, కునాల్ కుంభల్కర్, షారుఖ్ పఠాన్, ఇమ్రాన్ షేక్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు నలేన్ అలియాస్ నైలా షేక్ (24), క్రిష్ రౌత్ (19)ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
