ప్రైవేట్ ఆసుపత్రుల్లో వరుస మరణాలు.. నిద్రపోతున్న వైద్య ఆరోగ్య శాఖ?

ప్రైవేట్ ఆసుపత్రుల్లో వరుస మరణాలు.. నిద్రపోతున్న వైద్య ఆరోగ్య శాఖ?
ఆపరేషన్ విజయవంతమైందన్నారు.. అరగంటలోనే బాలిక మృతి!
ప్రతిమ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై తండ్రి ఫిర్యాదు.. సమగ్ర విచారణకు డిమాండ్
ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏదీ? చిన్నారి మృతిపై తండ్రి ప్రశ్న.
నేటి చర్చ : కొందుర్గ్ మండలం,రంగారెడ్డి జిల్లా, 13 ఏళ్ల బాలిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై తండ్రి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం లేదా చికిత్సలో జరిగిన లోపాలే తన కుమార్తె మరణానికి కారణమై ఉండవచ్చని ఆరోపిస్తూ, బాధ్యులైన వైద్యులు,ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఉమ్మెత్తల గ్రామానికి చెందిన ఎన్నేపల్లి రాఘవేందర్ రెడ్డి (39) కుమార్తె ఎన్నేపల్లి సహస్ర రెడ్డి (13) ఎల్‌బీనగర్‌లోని నారాయణ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతోంది.దసరా సెలవులకు స్వగ్రామానికి వచ్చిన సమయంలో అనారోగ్యానికి గురికావడంతో తొలుత నానక్‌రామ్‌గూడలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ వైద్యులు పరీక్షించి ఐరన్, విటమిన్ లోపాలు ఉన్నాయని మందులు ఇచ్చారు. వారం రోజుల పాటు మందులు వాడినా ఆరోగ్యంలో మెరుగుదల కనిపించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్టోబర్ 24న కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్టలోని ప్రతిమ ఆసుపత్రిలో చేర్పించారు.
ఊపిరితిత్తుల్లో ద్రవం గుర్తింపు.. తొలగింపు ప్రక్రియ
ప్రతిమ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన స్కానింగ్, అల్ట్రాసౌండ్ పరీక్షల్లో కుడివైపు ఊపిరితిత్తుల వద్ద ద్రవం పేరుకుపోయినట్లు గుర్తించారు. దీంతో సిరంజి ద్వారా సుమారు అర లీటరు ద్రవాన్ని తొలగించారు.అయితే అక్టోబర్ 26న మళ్లీ నిర్వహించిన ఛాతీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షల్లోనూ ద్రవం పూర్తిగా తొలగిపోలేదని వైద్యులు తెలిపినట్లు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.పైపు ద్వారా ద్రవాన్ని తొలగించాల్సి ఉంటుందని,ఈ ప్రక్రియకు 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పడుతుందని వైద్యులు చెప్పారని,ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇవ్వడంతో తాము అంగీకరించినట్లు తెలిపారు.
ఆపరేషన్ విజయవంతమైందని చెప్పి.. అంతలోనే విషాదం!
అక్టోబర్ 26న రాత్రి సుమారు 7.30 గంటలకు సహస్రను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. సుమారు గంట తర్వాత డాక్టర్ ఎర్రబెల్లి హర్షిణి బయటకు వచ్చి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని,ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపినట్లు తండ్రి పేర్కొన్నారు. మరో అరగంటలో బాలిక కోలుకుని గదికి వస్తుందని చెప్పినప్పటికీ, కొద్దిసేపటికే పల్స్ తగ్గిందని చెబుతూ ఐసీయూకు తరలించారని తెలిపారు.
అనంతరం అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో తమ కుమార్తె మరణించినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమార్తె మరణానికి కారణమేంటని డాక్టర్ ఎర్రబెల్లి హర్షిణి, డాక్టర్ బోయినపల్లి ప్రతీక్‌లను ప్రశ్నించగా బాలికకు రక్తం గడ్డకట్టే సమస్య ఉండటంతో పాటు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉందని తెలిపినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచి నిర్వహించిన పరీక్షల్లో కానీ, స్కానింగ్, ఇతర వైద్య పరీక్షల సమయంలో కానీ రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నట్లు తమకు ముందుగా తెలియజేయలేదని ఆరోపించారు.చికిత్సలో ఎదురయ్యే ప్రమాదాలు, సంభవించే సమస్యల గురించి కూడా స్పష్టంగా వివరించలేదని పేర్కొన్నారు.
సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పిన కొద్దిసేపటికే కుమార్తె మరణించడంతో తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని రాఘవేందర్ రెడ్డి తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం జరిగిందా? చికిత్సలో ఏమైనా లోపాలు ఉన్నాయా? లేక ఇతర వైద్యపరమైన కారణాలతో మరణం సంభవించిందా? అనే అంశాలపై నిపుణుల వైద్య బృందంతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.తన కుమార్తె మరణానికి గల వాస్తవ కారణాలను వెలుగులోకి తీసుకువచ్చి, విచారణలో నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులైన వైద్యులు, ప్రతిమ ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
