అశ్వారావుపేటలో దీపావళి సందడి. పటాసుల కొనుగోళ్లకు జోరందుకున్న ప్రజలు.

అశ్వారావుపేటలో దీపావళి సందడి. పటాసుల కొనుగోళ్లకు జోరందుకున్న ప్రజలు.
=> వినియోగదారుల కోసం అన్ని రకాల బాణసంచా అందుబాటులో.
=> పట్టణంలో 8 విక్రయ కేంద్రాల ఏర్పాటు.
నేటి చర్చ :- అశ్వారావుపేట , పట్టణంలో దీపావళి పండుగ సందడి మొదలైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు బాణసంచా కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. పండుగకు మరికొద్ది సమయం ఉండటంతో పట్టణంలోని బాణసంచా విక్రయ కేంద్రాల వద్ద సందడి నెలకొంటోంది.
మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా అశ్వారావుపేటకు చేరుకుని తమకు కావాల్సిన టపాసులు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విక్రయదారులు వివిధ రకాల బాణసంచాను అందుబాటులో ఉంచారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆకర్షించే విధంగా పలు రకాల క్రాకర్స్‌ను విక్రయానికి సిద్ధం చేశారు.
అశ్వారావుపేట పట్టణంలో మొత్తం 8 బాణసంచా విక్రయ దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలకు ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల టపాసులు ఒకే చోట లభించేలా వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కొనుగోలుదారులు ఆయా దుకాణాలకు తరలివస్తున్నారు.
దీపావళి పండుగ నేపథ్యంలో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొనగా, బాణసంచా దుకాణాల వద్ద కొనుగోళ్ల సందడి క్రమంగా పెరుగుతోంది. పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
