అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.. నేర ప్రవృత్తిని విడనాడాలి,రౌడీషీటర్లకు అశ్వారావుపేట పోలీసుల కౌన్సెలింగ్.

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.. నేర ప్రవృత్తిని విడనాడాలి,రౌడీషీటర్లకు అశ్వారావుపేట పోలీసుల కౌన్సెలింగ్.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - ఎస్.ఐ సాయి కిషోర్ రెడ్డి.
నేటి చర్చ :- అశ్వారావుపేట
పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి, ఎస్ఐ దేవ్ సింగ్ రౌడీషీటర్లతో మాట్లాడి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ, కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా జీవన విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.
ఎలాంటి గొడవలు, దాడులు, బెదిరింపులు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడటం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని, అటువంటి మార్గాలను విడనాడి ప్రశాంతమైన జీవనం సాగించాలని సూచించారు.
రౌడీషీటర్లపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత, పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
