శ్రీజ ఇండస్ట్రీస్‌లో బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

శ్రీజ ఇండస్ట్రీస్‌లో బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
నేటి చర్చ : కొత్తగూడెం , తేదీ:3 నవంబర్, భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. 175 మెట్రిక్ టన్నుల బియ్యంలో సుమారు 42 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించి, దాదాపు రూ.6.90 కోట్ల ప్రజాధనానికి సంబంధించిన అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. శ్రీజ ఇండస్ట్రీస్ అధినేత ఆళ్ల మురళీకృష్ణ ఈ వ్యవహారంలో బాధ్యత వహించాలని, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇదే జిల్లాకు చెందిన ఒక మంత్రికి ముఖ్య అనుచరుడిగా చెప్పబడుతున్న వ్యక్తి ప్రజలకు చేరవలసిన బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఈ వ్యవహారంపై పోలీసులను వివరణ కోరగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారని, అయితే ఎఫ్ఐఆర్ కాపీలు సైతం అందించలేని పరిస్థితి నెలకొనడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ తలొగ్గుతోందా? మూడు రోజులైనా చర్యలు తీసుకోకుండా ఎవరి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని ప్రశ్నించారు.కేవలం 2025–2026 ఆర్థిక సంవత్సరంలోనే ప్రజలకు చేరవలసిన, ప్రభుత్వం తిరిగి పొందవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొన్నారు.ప్రజాపక్షమని, ప్రజల కోసమే తమ పాలన అని చెప్పుకునే స్థానిక సీపీఐ ఎమ్మెల్యే మరియు సీపీఐ జిల్లా కార్యదర్శి ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.ఈ అక్రమాలపై సంబంధిత వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకొని నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, నిబంధనల ప్రకారం 25 శాతం పెనాల్టీతో సహా ప్రజాధనాన్ని పూర్తిస్థాయిలో రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ సంపాదనతో కూడబెట్టిన ఆస్తులను చట్ట ప్రకారం జప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా సివిల్ సప్లై శాఖ అధికారులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తూ, రైస్ మిల్లుల తనిఖీలను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు అండగా నిలుస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరియు సీబీఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.సీబీఐ విచారణ జరిగితే ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు, అలాగే వారికి అండగా నిలుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల పాత్రపై కూడా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించిన ఆరోపణలపైనా నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.అలాగే తన కనుసన్నల్లో పనిచేయని అధికారులను మానసికంగా వేధించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని, ఈ అంశాలపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు.చివరిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ: ప్రజాధనం దుర్వినియోగం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సొమ్మును తిరిగి రికవరీ చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాకేష్ బాబు, ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మంగీలాల్ నాయక్, చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, బూర్గంపాడు మండల అధ్యక్షులు సాయి శ్రీనివాస్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, పొదిల్ల శ్రీనివాస్, సబ్బాని రాజేష్ తదితర బీజేపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
