ఉట్లపల్లి సమీపంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, స్థానికులు.

ఉట్లపల్లి సమీపంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, స్థానికులు.
=> ప్రాణాలకు తెగించి వరద నీటిలోకి దిగి వ్యక్తిని రక్షించిన వైనం.
నేటి చర్చ :- అశ్వారావుపేట
భారీ వర్షాల కారణంగా అశ్వారావుపేట సమీపంలోని పెద్ద చెర్వు కు గండి పడటంతో రోడ్లపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని దాటేందుకు ద్విచక్ర వాహనంపై ప్రయత్నించిన ఓ వ్యక్తి అదుపుతప్పి వరద కాలువలో పడిపోయాడు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో బైక్‌తో సహా ఆ వ్యక్తి నీటిలో కొట్టుకుపోవడం అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది.
అదే సమయంలో సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, అక్కడే ఉన్న స్థానికులు ఈ ఘటనను గమనించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని గుర్తించి తాడుతో పట్టుకుని, అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఈ క్రమంలో ద్విచక్ర వాహనంతో పాటు వరదలో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు.
బయటకు తీసుకొచ్చిన వెంటనే బాధితుడికి ప్రాథమిక సహాయం అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
పోలీసులు, స్థానికులు సకాలంలో స్పందించి సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టకపోయి ఉంటే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద నీటిలోకి దిగి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసుల సాహసాన్ని, మానవత్వంతో స్పందించిన స్థానికుల చొరవను గ్రామస్తులు అభినందిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నాలు చేయవద్దని స్థానికులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు ముప్పు తెచ్చే సాహసాలకు పాల్పడకుండా సురక్షిత మార్గాలను ఎంచుకోవాలని కోరుతున్నారు.
