ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 1,135 మంది జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ.

ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 1,135 మంది జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ.
నేటి చర్చ : సింగరేణి భవన్,నవంబర్ 06, 2026 హైదరాబాద్, 1,135 మంది జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ అమలు
ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం
ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి క్రమబద్ధీకరణ అమలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఇటీవల కోల్ బెల్ట్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో బదిలీ వర్కర్ లేదా జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న దాదాపు 1,135 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్ లుగా క్రమబద్ధీకరణ చేయడానికి సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలకు పైగా వేచి చూస్తున్న కార్మికులకు ఇది గొప్ప శుభవార్త.
2025 డిసెంబర్ 31వ తేదీ నాటికన్నా ముందు ఉద్యోగంలో చేరి బదిలీ వర్కర్ లేదా జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పని చేస్తున్న కార్మికులకు ఇది వర్తిస్తుంది. 2025 డిసెంబర్ 31 వ తేదీ మరియు అంతకుముందు ఏ క్యాలెండర్ సంవత్సరంలోనైనా సరే భూగర్భ విభాగంలో పనిచేసిన వారైతే 190 పని దినాలు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా బయట విభాగాల్లో పనిచేసిన వారైతే 240 పని దినాలు పూర్తి చేసి ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది.
సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశంపై జనరల్ మేనేజర్ (పర్సనల్) ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ విభాగం సర్కులర్ ను విడుదల చేసింది. ఆయా ఏరియాలలో పనిచేస్తున్న అర్హుల జాబితాలను ఈ నెల 23వ తేదీ లోగా సమర్పించాలని ఏరియా జీఎంలను యాజమాన్యం కోరింది. అర్హుల జాబితాలోని ఉద్యోగులను 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుండి క్రమబద్ధీకరిస్తారు.
గతంలో బదిలీ వర్కర్ లేదా బదిలీ ఫిల్లర్ నుండి జనరల్ మజ్దూర్గా క్రమబద్ధీకరణ జరపడానికి కొంత నిరీక్షించాల్సి వస్తుండేది, అయితే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ క్రమబద్దీకరణ విధానాన్ని ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిపై కార్మిక వర్గం తమహర్షం ప్రకటిస్తోంది.
గైర్హాజరు లేకుండా క్రమశిక్షణతో పని చేస్తే మంచి ఫలితాలు
ఎటువంటి గైర్హాజరు లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించిన బదిలీ వర్కర్ లు లేదాజనరల్ అసిస్టెంట్ ట్రైనీలను జనరల్ అసిస్టెంట్ లుగా క్రమబద్ధీకరణ పొందుతారని, ఇదేవిధంగా ఇతరులు కూడా ప్రతి దినం విధులకు హాజరైతే మంచి ఉత్పాదకత పెరగడంతోపాటు కంపెనీ సంక్షేమ ఫలాలు మరిన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుందని యాజమాన్యం తెలియజేసింది.
ఇప్పటివరకు జనరల్ అసిస్టెంట్ లుగా క్రమబద్ధీకరణ పొందిన అనేకమంది ఉద్యోగులు ఆ తర్వాత జరిగిన అంతర్గత పదోన్నతులు మరియు నియామకాల ప్రక్రియలో తమ ఉద్యోగ అర్హతలకు అవకాశం ఉన్న ఉద్యోగాలను, పదోన్నతులను పొందారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని యాజమాన్యం పేర్కొంది. గైర్హాజరు లేకుండా పని చేస్తే క్రమబద్ధీకరణ పదోన్నతులు లభిస్తాయని, విధులకు గైర్హాజరయితే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనికనుక సింగరేణి అందించే మంచి అవకాశాలను అందుకోవాలని, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలలో తమ వంతు బాధ్యత నిర్వహించాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క క్రమబద్ధీకరణ పొందనున్న కార్మికులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తోందని, సింగరేణి అభివృద్ధికి మరియు విస్తరణకు ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేస్తూ సహకరించాలని కోరారు.
-చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
