రాజేంద్రనగర్ పీఎస్ ఎదుట ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా కవిత ఆందోళన.

రాజేంద్రనగర్ పీఎస్ ఎదుట ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా కవిత ఆందోళన.
నేటి చర్చ : రాజేంద్రనగర్, హైదరాబాద్, నవంబర్ 11,రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా బీఆర్ఎస్ నేత కవిత ఆందోళన చేశారు. రాత్రి 2 గంటలకు పైగా ఠాణా ఎదుట బైఠాయించారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ తేజశ్రీపై వీసీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనపై 15 రోజుల క్రితమే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కవిత ఆరోపించారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కవిత విమర్శించారు. బాధితురాలు 15 రోజుల క్రితమే కంప్లైంట్ చేసినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు.
కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడంతో ప్రొఫెసర్ తేజశ్రీ మంగళవారం పోలీస్ స్టేషన్ ముందు 8 గంటల పాటు ధర్నా చేశారని తెలిపారు. దీంతో దిగివచ్చిన పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామని చెబుతున్నారని అన్నారు.
15 రోజుల క్రితం కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ గానీ, అక్‌నాలెడ్జ్‌మెంట్ గానీ ఇవ్వకపోవడం అన్యాయమని కవిత అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పడంతో ఉమెన్ కమిషన్‌లో ఉన్న కేసు బలంగా మారే అవకాశం ఉందని అన్నారు. ప్రొఫెసర్ తేజశ్రీకి తామంతా అండగా ఉంటామని, ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కవిత తెలిపారు.
